శివసేన సుప్రీం బాల్‌ఠాక్రే వ్యాఖ్యలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపీ హరికృష్ణ ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాసం తననెంతో గాయపరిచిందంటూ ధ్వజమెత్తారు. ఠాక్రేకు ఆయన ఓ లేఖ రాశారు. ‘టీడీపీ బృందానికి చిప్పకూడు, తాగేందుకు మగ్గుతో నీళ్లిచ్చి ఉంటే ఏం జరిగేదో మీకు తెలుసు…’ అంటూ హెచ్చరిక ధోరణితో పేర్కొన్నారు.
ఆ లేఖ పూర్తి సారాంశమిది.. ‘నాడు ఎన్టీఆర్‌ను గద్దెదించినపుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో టీడీపీకి అండగా ఉన్న పెద్దరికం మీది. ఇన్నాళ్లూ మీలో ఒక శివాజీ, ఎన్టీఆర్‌లను చూశాను. శివాజీ ప్రతిష్ఠకే అప్రతిష్ఠ తెచ్చిన ఆశోక్‌చవాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని ఆశించా.
భూమిపుత్ర నినాదంతో మహారాష్ట్ర ప్రజల అభిమానం పొందినమీరు తెలంగాణ భూమి పుత్రుల ఆకలి కేకలు ఆలకిస్తారని భావించి భంగపడ్డా. రాజకీయం అంటే క్రికెట్ పిచ్‌లు తవ్వేయడం కాదు. వాలంటైన్స్ డే నాడు అమాయకులపై వీరత్వం చూపడం కాదు.
చిప్పకూడు, మగ్గుతో నీళ్లివ్వడం.. ఇదేనా మహారాష్ట్రలో అల్లుళ్లకు మీరు చేసే మర్యాద? తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ఇదే జరిగి ఉంటే ఏం జరిగేదో కూడా మీకు బాగా తెలుసు. ఎంఎన్ఎస్ పేరుతో జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోలేని, కొడుకు, కోడళ్లను అదుపులో పెట్టుకోలేని మీ నుంచి శాంతి, సామరస్యం ఆశించడం అత్యాశే.
వీరత్వం, ఆతిథ్యంలో మరాఠాలు ప్రసిద్ధి గాంచితే… శౌర్యం, పౌరుషాభిమానంలో తెలుగు జాతి ఔన్నత్యాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సాటి నేత, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తే నిర్బంధించి ఆగచాట్లు పెట్టిన ఘనత ఆశోక్‌చవాన్‌కు దక్కుతుంది.
సంస్ధాగతమే ‘దేశం’ బలం ఉప ఎన్నికల్లో చిత్రమైన
తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తమదని టీఆర్ఎస్.. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొంటూ ఎన్నికల బరిలో హోరాహోరీగా ప్రచార పర్వంలో మునిగి తేలు తుంటే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి మాత్రం తెలంగాణ ఉప ఎన్నికలలో సరైన నినాదమే లేకుండా పోయింది.
సంస్థాగతంగా పార్టీకి ఆయా ప్రాంతాల్లో ఉన్న బలం, ఏళ్ల తరబడి పాతుకుపోయిన నాయకత్వం ఆధారంగానే పోరాడాల్సి వస్తోంది. బాబ్లీ యాత్ర పేరుతో కొంతవరకు పార్టీకి సానుకూలత వచ్చినా.. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ప్రచారం లోకి దిగకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. బరిలో నిలిచిన ఉద్దండులు.. ప్రత్యర్థులకు గట్టి సవాలు విసురుతుండటం సానుకూల అంశం.
హైదరాబాద్, జూలై 22 : తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ అంశం చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ ఎన్నికల్లో తనకంటూ ఒక ప్రత్యేక ఎజెండా లేకపోవడంతో సంస్థాగతంగా ఉన్న బలాన్ని నమ్ముకొని ఆ పార్టీ పోరాడాల్సి వస్తోంది.
తెలంగాణలో టీడీపీకి సంప్రదాయికంగా ఉన్న బలం తక్కువేమీ కాకపోవడంతో మెజారిటీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రత్యర్థులకు సమవుజ్జీలుగా నిలిచి సవాల్ విసురుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ పని నడుస్తున్న సమయంలో ప్రజలు తమకు ఓట్లు వేస్తేనే తెలంగాణ అంశం నిలబడుతుందని టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది.
తెలంగాణ కోసం రాజీనామా చేసిన తమ త్యాగం వృధా పోనివ్వవద్దని ఆ పార్టీ అభ్యర్థులు కోరుతున్నారు. మరోపక్క తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనని కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నాన్ని కూడా వారు గట్టిగా చేస్తున్నారు. కానీ టీడీపీకి మాత్రం ఈ ఉప ఎన్నికల్లో ఇంత స్పష్టమైన నినాదం లేదు.
తెలంగాణ కోసం తామూ పోరాడుతున్నామని, ఇతర పార్టీల మాదిరిగా తెలంగాణ అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకొని వదిలివేసేవారం కాదని వారు చెబుతున్నా ప్రత్యర్థి పార్టీల ప్రచార హోరు ముందు అది అంత గట్టిగా వినిపించడం లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో జేఏసీలో చేరి ఉధృతంగా పనిచేయడం ఇప్పుడు వారి ముందరి కాళ్లకు బంధంగా మారింది.
No comments:
Post a Comment