Saturday, September 21, 2013
మల్లెలు నవ్విన వేళ..(oka romantic story)
శోభనం రాత్రి గూర్చి అందరూ ఏదేదో చెప్పగా విన్నాను. కానీ ఈ రోజు నాకే శోభనం అనేసరికి ఎంతో భయమేసింది. పాల గ్లాసుతో మెల్లగా శోభనం గదిలోకి వెళ్ళి పందిరి మంచం మీద భర్త ప్రక్కన కూర్చున్నాను. అతని దగ్గర నుండి అదో రకమైన వాసన వస్తోంది. ఆ వాసనను విస్కీ వాసనగా గుర్తించాను. అందుకే అతనితో మాట్లాడాలంటే భయమేసింది.
అయినా ధైర్యం చేసి-
"ఏమండీ! ఒక వ్యసనానికి అయ్యే ఖర్చుతో ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దవారిని చేయవచ్చని చెప్పారండీ పెద్దలు."అన్నాను మెల్లగా.
"నువ్వు ఏం మాట్లాడాతున్నావో అర్ధం కావడం లేదు." అన్నాడు వరుణ్.
"మీ దగ్గర విస్కీ వాసన వస్తుంటేనూ..." ఎంతో మెల్లగా చెప్పాను.
"ఓహో అదా ...అప్పుడప్పుడు త్రాగడం నాకు అలవాటు. త్రాగినప్పుడు సిగిరెట్ కూడా ముట్టిస్తుంటాను. వాటిని గూర్చి నువ్వు పెద్దగా పట్టించుకోకూడదు". అని జేబులోంచి గోల్డ్‌ఫ్లేక్ కింగ్ సైజ్ సిగరెట్ తీసి వెలిగించి అగ్గిపుల్లను నిర్లక్ష్యంగా విసిరేశాడు. మండుతున్న అగ్గిపుల్ల సరాసరి వెళ్ళి గదిలో ఓ మూల వున్న విస్కీబాటిల్‌లో పడింది. అంతే బాటిల్లోంచి బుస్‌మన్న శబ్దంతో మంట వచ్చింది. అది చూసిన నేను
"నా జీవితం కూడా యిలానే తగలబడిపోవలసిందే కాబోలు" అనుకోవడం నా భర్త ఎడతరపి లేకుండా దగ్గడం ఒకేసారి జరిగింది.
"ఏమైందండీ!" బాధగానే అడిగాను నేను.
సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా సిగరెట్ పొగ వదలసాగాడు.
"మీ వ్యసనాల వల్ల ఆర్ధికంగా దెబ్బ తినడమే కాదు ఆరోగ్యం కూడా దెబ్బ తింటుందండీ" ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ చెప్పాను.
"చూడు నువ్వు ఈ రోజు భార్యగా నా జీవితంలో ప్రవేశించావు. కానీ ఈ వ్యసనాలు నీకంటే ఎంతో ముందుగా నా జీవితంలో ప్రవేశించాయి. కనుక నువ్వు వాటిని గూర్చి మాట్లాడడం అనవసరం. సర్దుకు పోయి సంసారం చేయడం చేయడం మంచిది." అన్నాడు నిర్లక్ష్యంగా.
సర్దుబాటు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. అదే లేకపోతే ఎన్ని సంసారాలు వీధిన పడేవో అనుకొని నాలోనేనే ఏడుస్తూ బాధపడసాగాను.
"ఎందుకలా ఏడుస్తున్నావు?" భుజం మీద చెయ్యి వేసి అడిగాడు. ఆ గొంతులో ఏదో మార్పు కన్పించింది.
"భర్త వ్యసనపరుడు, త్రాగుబోతు అని మొదటి రాత్రే తెలుసుకున్న ఆడదాని బ్రతుకు ఏడుపు కాక ఏమవుతుందండీ." అన్నాను వెక్కిళ్ల మధ్య.
అంతే నన్ను భుజం పట్టుకొని మెల్లగా పైకి లేపి కన్నీళ్ళు తుడిచి-
"చూడు! నేను వ్యసనపరుడ్ని కాను. మొదటి రాత్రి భార్యను అదుపులో పెట్టుకోకపోతే జీవితాంతం నీమాట వినదు. అందుకే అలవాటు లేకపోయినా విస్కీ బాటిల్ శోభనం గదిలోకి తీసుకెళ్ళి షర్టుమీద చల్లుకో, నీ భార్య ముందు కాల్చి కొద్దిగా గట్టిగా మాట్లాడమన్నారు నా మిత్రులు. అంతేకానీ నాకు ఏ వ్యసనం లేదు. అందుకనే సిగరెట్ త్రాగగానే దగ్గు వచ్చింది. నీమీద ఒట్టు. కావాలంటే చూడు వాసన నా నోట్లో నుంచి కాదు. షర్టుమీద నుండి వస్తుందని నోరు తెరచి నా ముందుకు వచ్చారు.
నోరుతెరచిన నా భర్తను చూసి నేనూ ఆనందాశ్చర్యాలతో నోరు తెరిచాను. శోభనం మంచంచుట్టూ అలంకరించి వున్న తెల్లటి మల్లెలు కూడా ఆనందంగా నవ్వుతున్నట్లుగా నోరెళ్ళబెట్టి వికసించాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment