Showing posts with label తెలంగాణ ఇస్తేనే పార్టీ ఉంటుంది. Show all posts
Showing posts with label తెలంగాణ ఇస్తేనే పార్టీ ఉంటుంది. Show all posts

Friday, December 31, 2010

తెలంగాణ ఇస్తేనే పార్టీ ఉంటుంది: కిరణ్ కుమార్ రెడ్డితో కాంగ్రెసు ఎంపీలు

హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మిగులుతుందని, తెలంగాణ జిల్లాల్లోనే కేంద్ర బలగాలను ఎక్కువగా దించడం, ఓయూలోనే పది బృందాలను పైగా మోహరించడం వంటి చర్యల వల్ల తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎంపీలు ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. 'మనం తెలంగాణపై ఇక్కడ ఏం చేయలేం కదా? కేంద్రం, అధిష్ఠానం రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం కదా?' అని ఎంపీలతో అన్నట్లు తెలిసింది. అధిష్ఠానం నిర్ణయం కోసం వేచిచూద్దామని ఆయన చెప్పినట్లు సమాచారం. అన్ని జిల్లాలకు బలగాలను సమానంగా పంపాలని ఎంపీలు ప్రస్తావించగా.. ఆ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని సీఎం వారికి చెప్పినట్లు తెలిసింది. ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందజగన్నాథం, బలరాంనాయక్‌, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌షెట్కర్‌, సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జి.వివేకానందలు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాదరావు, వి.భూపాల్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఇంద్రసేన్‌రెడ్డిలతో కలిసి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు.

కేసులు ఎత్తేసినందుకు, తాము చేపట్టిన దీక్షకు సహకారం అందించినందుకు వారుసీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఎంపీలు నేతలు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, సీనియర్‌ నేత కె.కేశవరావు, పంచాయతీరాజ్‌ మంత్రి కె.జానారెడ్డిలను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్‌ నివాసంలో వారు మాట్లాడారు. పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి కేసులు ఎత్తేయించడంలో చొరవ తీసుకున్నందుకు డీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రసాధనకూ పనిచేస్తామని ఎంపీలు అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఎత్తేయడం, తాము చేసిన దీక్ష అంతా డ్రామా అని తెదేపా నేతలు విమర్శించడాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయించేటపుడు, హైదరాబాద్‌లో ఎస్సై పరీక్షలు వాయిదా వేయించేందుకు, 14ఎఫ్‌ క్లాజు రద్దు విషయంలో తాము పోరాడుతున్నపుడు తెదేపా తెలంగాణ నేతలు ఏమయ్యారని నిలదీశారు. తెదేపాకు తమను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు.


Congress